నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వద్ద అన్నదానం…
నిజామాబాద్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం ‘మనం’ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జి. సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే అధ్యక్షులు రజినీకాంత్ హాజరై వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. ‘మనం’ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జి. సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన బాధ్యతలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం సంతోషకరమని పేర్కొన్నారు. దైవభక్తి, సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవాభావాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు.
భవిష్యత్తులోనూ జర్నలిస్టుల ఐక్యతతో ఇలాంటి సామాజిక, సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ‘మనం’ దినపత్రిక ఉమ్మడి నిజామాబాద్ జర్నలిస్టు బృందం సభ్యులు, వారి కుటుంబ సభ్యులు, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.

























