ప్రజా ప్రతినిధులతో సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: గ్రామపంచాయతీలలో చేపట్టిన అభివృద్ధికార్యక్రమాలను ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ వేగవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి వి. విజేత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం భీంగల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీల అభివృద్ధి కార్యక్రమాలపై మండల ప్రత్యేక అధికారి వి. విజేత అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు తమ తమ గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యలను మండల ప్రత్యేక అధికారి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన సమస్యలను వివరించారు.
సర్పంచులు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి సూచించారు. ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ సమావేశంలో ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, తహసీల్దార్ కిరణ్, మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.

























