మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
నిజామాబాద్: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల డిమాండ్ చేశారు.
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్లు, లైన్మెన్లు, పారిశుద్ధ్య కార్మికులు, డ్రైవర్లు, వాటర్ సెక్షన్ సిబ్బంది గత ఐదు రోజులుగా ధర్నా చౌక్‌లో చేపడుతున్న సమ్మెకు గణేష్ బిగాల హాజరై సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులు తన కుటుంబ సభ్యులతో సమానమని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు. ప్రభుత్వం వెంటనే జీవో 52ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.19,500 వేతనాన్ని పెంచి కనీస వేతనంగా రూ.26,000 చెల్లించాలని కోరారు.
ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు కార్మికులకు వేతనాలు చెల్లించాలని, రాత్రివేళల్లో విధులు నిర్వహించే సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఐడీ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందితే అంత్యక్రియల కోసం తక్షణమే రూ.20,000 ఆర్థిక సాయం అందించాలని, మృతుల కుటుంబ సభ్యులకు వయోపరిమితిలో సడలింపు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
వినాయక చవితి ఉత్సవాల సమయంలో వీధిదీపాలు వెలగక నగరం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ప్రజలకు ఇబ్బందులతో పాటు శాంతిభద్రతలకు కూడా విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు సేవలందించిన మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. కార్మికుల సమ్మె కారణంగా నగరంలో పారిశుధ్య నిర్వహణ, వీధిదీపాల నిర్వహణ వంటి సేవలకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని సూచించారు.
కార్మికులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్న గణేష్ బిగాల.. జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ వెంటనే కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డి, అబ్దుల్ మతీన్ తదితరులు పాల్గొన్నారు.

























