ప్రభుత్వం, పోలీసులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు
రోగుల పరామర్శను కూడా రాజకీయం చేస్తారా?
భేషరతుగా క్షమాపణ చెప్పి.. కేసులు ఉపసంహరించుకోవాలి
వరంగల్ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి…
వరంగల్లో చోటుచేసుకున్న ఘటనను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు.
ఇబ్బందుల్లో ఉన్న రోగులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ సీనియర్ నేత వినయ్ భాస్కర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీనియర్ ప్రజాప్రతినిధితో పోలీసులు కనీస మానవత్వంతో వ్యవహరించాల్సి ఉండేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం, పోలీసులు వేధింపులు, అరాచకాన్ని నమ్ముకుంటే ప్రజల మద్దతును కోల్పోయే పరిస్థితి వస్తుందని ప్రశాంత్ రెడ్డి అన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడులు, పార్టీ నేతల ఇళ్లపై దాడుల ఘటనలు జరిగాయని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు తావు ఉండకూడదని అన్నారు. ప్రభుత్వ పెద్దలు, పోలీసులు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

























