నిస్వార్థ సేవకుడు సంతోష్ రెడ్డి
50వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
రక్తదాత సంతోష్ రెడ్డి సేవలు అభినందనీయం: ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంతోష్ రెడ్డి 50వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యుడు డాక్టర్ బాలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రంలో సంతోష్ రెడ్డి 50వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉన్నత స్థాయిలో పనిచేస్తూ, ప్రతి సంవత్సరం నాలుగు సార్లు రక్తదానం చేయడం అభినందనీయమని అన్నారు. అంతేకాకుండా తన తోటి ఇంజనీర్లు, యువతకు రక్తదానంపై అవగాహన కల్పిస్తూ వారిని కూడా ఈ మహత్తర సేవలో భాగస్వాములను చేయడం సంతోష్ రెడ్డి ప్రత్యేకత అని కొనియాడారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పదోన్నతి పొంది కెనడాకు వెళ్తున్న సందర్భంలోనూ రక్తదానం చేసి తన సామాజిక బాధ్యతను చాటుకున్నారని తెలిపారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు రావడం వల్లే ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతున్నామని పేర్కొన్నారు.
50వ సారి రక్తదానం చేసిన సంతోష్ రెడ్డిని డాక్టర్ బాలు అభినందించి, ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి సేవలను పలువురు ప్రశంసించారు.

























