వైద్య రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలి
ప్రిస్క్రిప్షన్ అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలి: జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి…
నిజామాబాద్, అక్టోబర్ 24: వైద్య వృత్తిలో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ వైద్య రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ, వాటిని జాగ్రత్తగా భద్రపరచాలని జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి సూచించారు. అలాగే వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లు రోగులకు, ఇతర వైద్య నిపుణులకు సులభంగా అర్థమయ్యేలా స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు.
నిజామాబాద్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, వైద్యరంగ నిపుణుల కోసం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి జీ.వీ.ఎన్. భరతలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు డీసీపీ శుభం నగ్రాలే తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి, కలెక్టర్‌తో పాటు ఇతర వక్తలు వైద్యుల హక్కులు, వైద్య సేవలందించే సమయంలో పాటించాల్సిన చట్టపరమైన నిబంధనలు, వృత్తిపరమైన బాధ్యతలపై అవగాహన కల్పించారు.
హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (ప్రివెన్షన్ ఆఫ్ వయలెన్స్) చట్టం–2025, వైద్య రికార్డుల నిర్వహణ, వాటి చట్టపరమైన ప్రాముఖ్యత, న్యాయ విచారణల్లో వైద్య రికార్డుల ప్రామాణికత వంటి అంశాలను సదస్సులో వివరించారు.
వైద్య సేవలందించే సమయంలో చట్టపరమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రోగులకు సంబంధించిన వైద్య రికార్డులను సమగ్రంగా నమోదు చేసి భద్రపరచాలని వక్తలు సూచించారు. వైద్యులు తమ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం ద్వారా రోగుల హక్కులను పరిరక్షించడంతో పాటు న్యాయ ప్రక్రియకు కూడా సహకరించినవారవుతారని పేర్కొన్నారు.
న్యాయ విచారణల్లో అవసరమైనప్పుడు వైద్యులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, వైద్య రంగానికి, న్యాయవ్యవస్థకు మధ్య సమన్వయం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. నారాయణ, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి నీలిమ ముద్దసాని, ట్రైనీ కలెక్టర్ సురేష్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్. సుభాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎ. విశాల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, రాష్ట్ర వైద్య మండలి జిల్లా ఇన్చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ రాథోడ్, రాజ్ కుమార్ సుబేదార్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

























