370 మంది లబ్ధిదారులకు రూ.3.70 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ సంక్షేమ పథకాల అమలు.. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన కొనసాగుతోందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన 370 మంది లబ్ధిదారులకు రూ.3.70 కోట్ల విలువైన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా నిజామాబాద్ రూరల్ మండలానికి 65, మోపాల్ మండలానికి 37, డిచ్‌పల్లి మండలానికి 128, జక్రాన్‌పల్లి మండలానికి 33, ధర్పల్లి మండలానికి 61, సిరికొండ మండలానికి 46 మంది చొప్పున మొత్తం 370 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ, మహిళా సాధికారతకు కృషి చేస్తోందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన, కుటుంబాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపిందని విమర్శించారు. అయినప్పటికీ, ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, ఇప్పటివరకు మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల రుణాలు అందించినట్లు వెల్లడించారు.
రానున్న రోజుల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. గతంలో భూమి ఉన్న రైతులకు మాత్రమే పరిమితమైన బీమా ప్రయోజనాలకు భిన్నంగా, కుటుంబంలో ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేలా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు వివరించారు.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
370 మంది లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో క్యాంపు కార్యాలయానికి తరలిరావడంతో అక్కడ సందడి నెలకొంది. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, ఉమ్మాజి నరేష్, అమృతాపూర్ గంగాధర్, తారాచంద్, బాల్‌రాజు, ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి, నరేష్, రవి, అంబర్ సింగ్, సర్పంచ్ ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు వాసు, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

























