కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదు.. నిరాశలో సీనియర్ నాయకులు!
పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తున్నారని ఆవేదన
బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సీనియర్ కార్యకర్తల అసంతృప్తి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా : డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కార్యకర్తల కష్టం, త్యాగాలు ఎంతో ఉన్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో పార్టీ జెండాలు మోస్తూ, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు ప్రస్తుతం తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తలను పార్టీ సమావేశాలకు ఆహ్వానించకపోవడం, కార్యక్రమాల గురించి సమాచారం అందించకపోవడం తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేస్తోందని పేర్కొన్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొందరికి కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత లభిస్తోందని, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలను మాత్రం విస్మరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని సూచించారు. గ్రామస్థాయి పార్టీ శ్రేణులను విస్మరించకుండా, వారిని కలుపుకుని ముందుకు సాగాలని కోరారు.
ప్రజల్లో పార్టీ పట్ల వ్యతిరేకత ఏర్పడకుండా నాయకులు సమన్వయంతో పనిచేయాలని, పార్టీ భవిష్యత్తు కోసం ప్రతి కార్యకర్తకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికైనా పార్టీ నాయకత్వం స్పందించి, పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు కల్పించాలని మెంట్రాజ్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు.

























