భీంగల్ పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై మున్సిపల్ అధికారుల తనిఖీలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భీంగల్ పట్టణంలో మున్సిపల్ అధికారులు పలు దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్న దుకాణదారులను గుర్తించి, వారికి జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ.. పట్టణంలోని హోటళ్లు, బేకరీలు, పాస్ ఫుడ్ సెంటర్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల యజమానులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నివారించాలని సూచించారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాలని కోరారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కమిషనర్ సూచించారు. ఇకపై కూడా పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంపై తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలు విధిస్తామని అధికారులు తెలిపారు.

























