రామడుగులో మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ.. నిందితుడి అరెస్ట్!
మూడు తులాల బంగారు గొలుసు, చోరీకి ఉపయోగించిన బైక్ స్వాధీనం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగులో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సుద్దపల్లి రాజు (35)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే.. రామడుగు గ్రామానికి చెందిన గడ్డం పద్మ (45) మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును నిందితుడు సుద్దపల్లి రాజు అపహరించి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణలో భాగంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి చోరీకి గురైన మూడు తులాల బంగారు గొలుసుతో పాటు, నేరానికి ఉపయోగించిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసును సమర్థవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను ఏసీపీ బి. ప్రకాష్ అభినందించారు.
ఈ కేసు దర్యాప్తులో సీఐ రామన్, ఎస్సై సందీప్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

























