ధర్పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం 11 నెలల పాలన పూర్తి
ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం: సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి గ్రామపంచాయతీ పాలకవర్గం 11 నెలల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మహిళా భవనాల నిర్మాణం, బైపాస్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని వెల్లడించారు.
మండల కేంద్రంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే రూ.30 లక్షలు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే భవన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.
గ్రామ అభివృద్ధికి పాలకవర్గం నిరంతరం కృషి చేస్తుందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

























