దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు
*పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి ఇది గుణపాఠం*
*BRS నుండి కాంగ్రెస్ లో చేరిన ఇతర ఎమ్మెల్యే లకు కూడా న్యాయస్థానంలో భంగపాటు తప్పదు*
*హైకోర్టు తీర్పును బీఆర్‌ఎస్ పార్టీ స్వాగతిస్తోంది.*
*సత్యమేవ జయతే..ఏప్పటికైనా న్యాయమే గెలుస్తుంది*
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి…
బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి, అదే పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు కీలకమైన పరిణామం అని అన్నారు.
దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పక్కనపెట్టింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ప్రజలు ఒక పార్టీ గుర్తుపై ఓటు వేసి గెలిపించిన తర్వాత, ఆ ప్రజా తీర్పును పక్కనపెట్టి అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే చర్య.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహరించింది. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయింపుల విషయంలో చట్టం, రాజ్యాంగ నిబంధనలు ఎంత కీలకమో మరోసారి స్పష్టమైంది.
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇతర ఎమ్మెల్యేలకు కూడా ఈ తీర్పు ఒక స్పష్టమైన గుణపాఠం. పార్టీ మారి ప్రజల తీర్పును అవమానించిన ప్రతి ఒక్కరూ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదు. న్యాయస్థానంలో ఇదే గుణపాఠం మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా తప్పదు.
పార్టీ ఫిరాయింపుల ద్వారా అధికారాన్ని బలోపేతం చేసుకోవచ్చని అనుకుంటె ఈ రోజు హై కోర్టు తీర్పు ఆ విధానంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాలను గౌరవించాలి.
ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం మానుకోవాలి. ప్రజల తీర్పును గౌరవించి, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి.ప్రజల కిచ్చిన హామీలు నెరవేర్చాలి.
హైకోర్టు తీర్పును బీఆర్‌ఎస్ పార్టీ స్వాగతిస్తోంది.

























