దీపావళి వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ!
కిసాన్ ఫ్యాషన్ మాల్లో ఘనంగా లక్ష్మీ పూజలు.. నగర ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలని ఆకాంక్ష…
ఇందూరు: దీపావళి పండుగ నగర ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నింపాలని భగవంతుడిని ప్రార్థించినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు.
దీపావళి పండుగను పురస్కరించుకుని నగరంలోని కిసాన్ ఫ్యాషన్ మాల్లో ఘనంగా లక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నరకాసురుడిపై శ్రీకృష్ణుడు సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పండుగను జరుపుకుంటామని తెలిపారు. హిందూ సంప్రదాయంలో దీపావళికి ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి పండుగకు ఒక పరమార్థం, గొప్ప సందేశం ఉంటుందని, అలాంటి ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన పండుగ దీపావళి అని పేర్కొన్నారు. ఎన్ని చీకట్లు ఎదురైనా ఒక చిన్న దీపం వెలుగును పంచగలదని, అదేవిధంగా సమాజంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఒక మంచి ఆలోచన, ఒక మంచి వ్యక్తి మార్పునకు నాంది పలకగలరని అన్నారు.
శ్రీరాముడి ఆదర్శ పాలన, శ్రీకృష్ణుడి ధర్మరక్షణ, లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో ఆనందం, ప్రతి కుటుంబంలో ఐశ్వర్యం, ప్రతి మనసులో సంతోషం వెల్లివిరియాలని కోరుకున్నారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు.

























