ధర్పల్లిలో భూ ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు ఫిర్యాదు
తన భూమిని ఆక్రమించుకున్నారని బాధితుడి ఆరోపణ…
నిజామాబాద్ జిల్లా : ధర్పల్లి మండల కేంద్రంలోని సర్వే నంబర్ 195/1లో తనకు చెందిన భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకున్నారని ధర్పల్లికి చెందిన కుమ్మరి రాజేశ్వర్ ఆరోపించారు. ఈ విషయంపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
తనకు సర్వే నంబర్ 195/1లో మొత్తం ఆరు ఎకరాల భూమి ఉందని, అందులో రెండు ఎకరాలకు సంబంధించి వివాదం నెలకొందని రాజేశ్వర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. భూమికి సంబంధించిన పత్రాలను తీసుకుని తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రస్తుతం తన భూమి వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భూమికి సంబంధించిన వివాదంపై అధికారులు సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీయాలని, తనకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డిని కుమ్మరి రాజేశ్వర్ కోరారు.

























