*ఏప్రిల్ 02న జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సభల నిర్వహణ*
*అధికారులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి దిశానిర్దేశం*
నిజామాబాద్, మార్చి 16 : మండల ప్రత్యేక అధికారులు అందరూ తప్పనిసరిగా క్షేత్రస్థాయి సందర్శనలు జరపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. వచ్చే రెండు మూడు వారాలు ఎంతో కీలకమైనవి, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. బాలికల గురుకుల పాఠశాలలను సందర్శించే సమయంలో వారి ఆరోగ్యం, సామాజిక సమస్యలు, మానసికపరమైన ఒత్తిడి తదితర అంశాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా విద్యార్థినుల నుండి వివరాలు సేకరించాలని ఆదేశించారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నారా లేదా అన్నది పరిశీలించాలని, విద్యార్థినులకు ఇంకనూ ఏమైనా సహాయ సహకారాలు, మద్దతు అవసరం ఉందా అన్నది గుర్తించాలన్నారు.
వచ్చే ఏప్రిల్ 01 నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఈ-ఆఫీసులుగా మారాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. పరిపాలనా పరమైన అనుమతులు, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఆన్ లైన్ విధానంలోనే జరగాలని ఆదేశించారు. ఆన్లైన్ విధానంపై అవసరమైతే ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలని ఈడిస్ట్రిక్ట్ మేనేజర్ కార్తీక్ కు సూచించారు. ఈ-ఆఫీసు ప్రక్రియకు ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ నోడల్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారని అన్నారు.
కాగా, ఏప్రిల్ 02న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలు విధిగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఉదయం 8.00 గంటలకు సభలు ప్రారంభం అయ్యేలా చూడాలని, షామియానా తాగునీరు వంటి సదుపాయాలు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంట రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల జారీ, పెన్షన్ల మంజూరు, మహాలక్ష్మి పథకం అమలు తదితర వివరాలను గ్రామ, వార్డుల వారీగా సభలలో వెల్లడించాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు తమ మండలాల పరిధిలోని గ్రామ సభలను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఇదిలాఉండగా, స్పెషల్ రివిజన్ ఇంటెన్సివ్ పూర్వ ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే సోమవారం నాటికి మ్యాపింగ్ 70 శాతం పూర్తి కావాలని అన్నారు.
*వలస కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తింపజేయాలి : కలెక్టర్*
వలస కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తించేలా సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం ఐ.డీ.ఓ.సీలోని కాన్ఫరెన్స్ హాల్ లో వలస కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, తదితర చోట్ల పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు తగిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేసేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఎవరైనా బాల కార్మికులను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వలస కార్మికుల కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉన్నందున, వారి వివరాల సేకరణ, రిజిస్ట్రేషన్ కోసం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశాలలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఇంచార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీఓ సాయగౌడ్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా కార్మిక శాఖ సహాయ కమిషనర్ యాదగిరి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

























