ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తగ్గించడం దారుణం..
ఆటో డ్రైవర్లనూ విస్మరించారు..
అసెంబ్లీలో పలు అంశాలను ప్రస్తావించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…
ఇందూరు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్త డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. గత సంవత్సరం బడ్జెట్లో 6 గ్యారంటీలకు రూ.56,083 కోట్లు కేటాయిస్తే.. ఈసారి మాత్రం 50,713 కోట్ల కే పరిమితం చేసిందన్నారు. సుమారు 5,370 కోట్లు కోత విధించిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆర్ గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకొస్తామని స్వయంగా రాహుల్ గాంధీ ప్రకటించారని చెప్పారు. ప్రస్తుతం కేటాయించిన నిధులు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారని నమ్మకం తమకు లేదన్నారు. ఎందుకంటే గత సంవత్సరం 49,315 కోట్లు కేటాయింపులు చేసి 24 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు.
అలాగే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మల్లో నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం… బడ్జెట్ లో మాత్రం నిధులను భారీగా కోత విధించిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం గత సంవత్సరం 12,571 కోట్లు కేటాయిస్తే ఈసారి మాత్రం కేవలం 5500 కోట్లు కేటాయించడం దారుణం అన్నారు. సుమారు 7 వేల కోట్లు కోత విధించిందన్నారు. మరో విచిత్రం ఏమిటంటే గత మూడు బడ్జెట్లలో కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించిన నిధుల్లో కేవలం 300 కోట్లు మాత్రమే తెలిపారు. ఉచిత బస్సు పథకం ద్వారా వేలాదిగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించిందని చెప్పారు. కానీ ఈ బడ్జెట్లో ఆటో డ్రైవర్లకు మొండి చేయి చూపించిందన్నారు. ఏడాదికి రూ.12 వేల భృతి, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని అన్నారు. అలాగే ఎస్సీ సంక్షేమానికి గత సంవత్సరంలో 40 వేల కోట్లు నిధులు కేటాయించగా ఈసారి 11 వేలకు పరిమితం చేయడం దారుణం అన్నారు. ఏది ఏమైనా ప్రస్తుత బడ్జెట్ నిరాశ కలిగించిందని తక్షణమే సవరణ చేయాలన్నారు.

























