శివమెత్తిన మహిళా శివంగులు
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
జూన్ 19 త్రిశూల్ న్యూస్: నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం మండల కేంద్ర మహిళా సంఘాల మహిళలంతా కలిసి తమకు చెందిన సంఘం స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ బస్టాండ్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్ర బిఎస్ఎన్ఎల్ ఆఫీసు పక్కన గల మహిళా సంఘం స్థలంలో పక్కనే ఉన్న బ్రహ్మంగారి ఆలయానికి సంబంధించిన పిల్లర్లను నిర్మించడంతో మహిళలంతా కలిసి గ్రామపంచాయతీ వరకు వెళ్లి సర్పంచ్ కు సెక్రటరీకి ఫిర్యాదు చేసి బస్టాండ్ ఎదురుగా కొద్దిసేపు ధర్నా చేసి అనంతరం మహిళా సంఘం భవనం ఆవరణలో కట్టిన పిల్లర్లను కూల దోశారు. ఈ సందర్భంగా మహిళా సమైక్య అధ్యక్షులు ఎర్రం పద్మ మాట్లాడుతూ.,…. గత 30 సంవత్సరాల నుండి మహిళా సంఘాల మహిళలంతా 30 రూపాయల నుండి పొదుపు చేసుకుంటూ మహిళా గ్రూపులను తయారు చేసుకున్నామని అప్పటినుండి ఎన్నో బాధలను భరిస్తూ మహిళా భవనాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని, మండల కేంద్రంలో ఏడు సంఘాలతో దాదాపు 3000 మందికి ఈ భవనం ఒకటే దిక్కని, ఈ భవనంలో కనీస అవసరాలైన బాత్రూంల సదుపాయాలు కూడా లేకున్నా సమావేశాలను అలాగే నిర్వహించుకుంటున్నామని, ఈ చిన్న భవనాన్ని కాస్త పక్కనున్న బ్రహ్మంగారి టెంపుల్ వారు ఆక్రమించుకోవడం ఎంత మట్టుకు సమంజసం అని అన్నారు. గత నెల రోజులుగా అధికారులకు గ్రామపంచాయతీ సెక్రటరీకి మొరపెట్టుకుంటున్నామని, అయినా ఎవరినీ ఖాతరు చేయకుండా రాత్రికి రాత్రే పిల్లర్లను వేశారని అందుకే ఈరోజు మా మహిళలంతా ఆగ్రహించి చివరిసారిగా గ్రామపంచాయతీలో ఫిర్యాదు చేసి బస్టాండ్ ఎదురుగా మా నిరసన వ్యక్తం చేసి మా సంఘ భవనంలో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చివేశామన్నారు. వెంటనే కబ్జా చేసిన వారిపై చర్య తీసుకుని మా సంఘ భవనానికి హద్దులు నిర్ణయించి భవనంలో సదుపాయాలు కల్పించాలని లేదంటే కలెక్టర్ వరకు వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు.





















