Arrive and Alive కార్యక్రమం మూడవ రోజు విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపు
బాలల రహదారి భద్రత దినోత్సవం మైనర్ డ్రైవింగ్‌పై పోలీసుల కఠిన హెచ్చరిక
పాఠశాలల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సులు, పోటీలు నిర్వహణ
హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగంపై ప్రాముఖ్యత వివరించిన పోలీసులు
కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న “Arrive and Alive” అవగాహన కార్యక్రమాలు మూడవ రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా “బాలల రహదారి భద్రత దినోత్సవం”గా నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ మరియు సీటుబెల్ట్ వినియోగం ప్రాముఖ్యతను విజువల్స్ ద్వారా వివరించారు. మైనర్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని, ఇది ప్రాణాపాయానికి దారితీస్తుందని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు పోలీసులు స్పష్టంగా తెలియజేశారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించడం ద్వారా భవిష్యత్తులో బాధ్యతగల పౌరులుగా మారేలా దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
జిల్లాలోని బిచ్కుంద, మద్నూర్, గాంధారి, బీబీపేట్, బిర్కూర్ మరియు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాలల్లో ట్రాఫిక్ సంకేతాలపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిలో ఉత్సాహాన్ని పెంపొందించారు. ఈ కార్యక్రమాలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల సహకారంతో రోడ్డు ప్రమాదాలను నియంత్రించి సురక్షిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

























