నిజామాబాద్ రీజియన్ ప్రజలకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త
ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు అవకాశం.. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి: రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి…
నిజామాబాద్: నిజామాబాద్ రీజియన్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాలకు ప్రయాణించే వారితో పాటు తిరిగి తమ గ్రామాలకు చేరుకునే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్‌ఆర్టీసీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకోవాలని రీజినల్ మేనేజర్ శ్రీ ఎస్.వి.జి. కృష్ణమూర్తి సూచించారు.
ప్రయాణికులు తమ ప్రయాణాలను సులభంగా, సౌకర్యవంతంగా ప్లాన్ చేసుకునేందుకు టీజీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రయాణికులు www.tgsrtcbus.in వెబ్‌సైట్‌ను సందర్శించి అందుబాటులో ఉన్న బస్సు సర్వీసుల వివరాలను తెలుసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ముందస్తుగా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవడం ద్వారా ప్రయాణాన్ని మరింత సులభతరం చేసుకోవచ్చని తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని, టీజీఎస్‌ఆర్టీసీ అందిస్తున్న సేవలకు సహకరించాలని నిజామాబాద్ రీజినల్ మేనేజర్ ఎస్.వి.జి. కృష్ణమూర్తి కోరారు.

























