కేత్ బచావో అభియాన్లో భాగంగా ఆరుతడి పంటల సాగుపై అవగాహన
ఎల్నినో ప్రభావంతో నీటి కొరత ఏర్పడే అవకాశం.. పంటల మార్పిడిపై రైతులకు వ్యవసాయ అధికారి శ్రీకాంత్ సూచనలు…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఇందల్వాయి, అక్టోబర్ 29: ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి, వెంగళ్పాడ్, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ‘కేత్ బచావో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో రైతులకు ఆరుతడి పంటల సాగు ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గి సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించి, జొన్న, మినుము, పెసర, శనగ, కుసుమ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల మార్పిడి ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమాల్లో ఏఈఓలు రామకాంత్, మనోజ్, సిర్నాపల్లి సర్పంచ్ పొగుల అనిత సాయికృష్ణ, ఉపసర్పంచ్ సుదర్శన్, వెంగళ్పాడ్ సర్పంచ్ మీన గంగాధర్, ఉపసర్పంచ్ మహిపాల్ నాయక్, నల్లవెల్లి సింగిల్ విండో చైర్మన్ నోముల శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు, గంగారెడ్డి, ఎల్ఐసీ గంగాధర్, సరస్వతి, మాజీ సర్పంచ్ రాయసింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

























