సీఎంసీ, ఐఎంఎస్ఆర్‌పై తప్పుడు ఆరోపణలు ఖండిస్తున్నాం – చైర్మన్ డాక్టర్ షణ్ముగం మహాలింగం
నిజామాబాద్‌లోని సీఎంసీ మెడికల్ కాలేజీ వ్యవహారంపై జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఐఎంఎస్ఆర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షణ్ముగం మహాలింగం కీలక వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎంసీ మరియు ఐఎంఎస్ఆర్ యాజమాన్యంపై కొందరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. సుమారు రూ.200 కోట్ల పెట్టుబడితో మెడికల్ కాలేజీ అభివృద్ధికి కృషి చేస్తున్న తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
సీఎంసీ క్యాంపస్‌లో జరిగిన ఘటనలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నంబర్ 176/2026 కింద సీఎస్‌ఐ ప్రతినిధులు బి. విమల్ సుకుమార్, దయానంద్, కె.వి. ప్రసాద్, డాక్టర్ అజ్జ శ్రీనివాస్ తదితరులపై కేసు నమోదు అయినట్లు వెల్లడించారు.
దీనికి ప్రతిస్పందనగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మరో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. సీఎస్‌ఐ ప్రతినిధులతో తనకు ఎలాంటి చట్టబద్ధమైన ఎంఓయూ లేదని, నకిలీ ఐఏఎస్ పేరుతో తాను వ్యవహరిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణలు అసత్యమని చెప్పారు.
మెడికల్ కాలేజీ పునరుద్ధరణ కోసం ఇప్పటికే సుమారు రూ.25 కోట్లు ఖర్చు చేశామని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కొందరు వ్యక్తులు సీఎంసీ పేరును ఉపయోగించి అక్రమ లావాదేవీలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి చర్యలకు ఐఎంఎస్ఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
సీఎంసీ నిర్వహణకు అవసరమైన అనుభవం, సామర్థ్యం, వనరులు తమ సంస్థకు సమృద్ధిగా ఉన్నాయని, బయటి వ్యక్తుల సహాయం అవసరం లేదన్నారు. డాక్టర్ అజ్జ శ్రీనివాస్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదై ఉన్నాయని, అవసరమైతే చట్టపరమైన చర్యలను మరింత వేగవంతం చేస్తామని హెచ్చరించారు.
అక్టోబర్ 2024లో సీఎస్‌ఐ టీఏ మెదక్ డయాసిస్‌తో కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు సీఎంసీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గత రెండేళ్లుగా చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నామని డాక్టర్ షణ్ముగం మహాలింగం పేర్కొన్నారు.























