నిజామాబాద్ జిల్లా పోలీసులు – సైబర్ నేరాలపై ప్రత్యేక ఆపరేషన్
Operatiion crack down
జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో, అక్రమంగా బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్న ఒక నెట్‌వర్క్‌ను నాగవ టౌన్ పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసు ల సహాయంతో విజయవంతంగా బట్టబయలు చేశారు.
ఈ కేసులో భాగమైన నిందితులను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు వివిధ నెంబర్లతో , ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి బిజినెస్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ మోసగాళ్లకు అందించడం ద్వారా భారీ స్థాయిలో మోసాలకు సహకరించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ప్రాథమిక విచారణలో, ఈ అకౌంట్ల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు రూ.31 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు గుర్తించాం. ఈ మొత్తాన్ని వివిధ రకాల సైబర్ మోసాలకు వినియోగించినట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. మరికొంతమంది వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వారిని త్వరలో గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాము.
అరెస్ట్ చేసిన నిందితులు:
1. మొహమ్మద్ అజర్ (28), డ్రైవర్, రేంజల్ బేస్, బోధన్
2. శ్యామల నవీన్ (30), డెయిరీ ఫార్మ్, ఏకచక్ర నగర్, బోధన్
3. ఖాసిం పటేల్ (25), ఉద్మీర్ గల్లి, బోధన్,
4. మొహమ్మద్ మినాజ్ అహ్మద్ (35), ఫ్రూట్ వ్యాపారం, రేంజల్ బేస్, బోధన్
5. సయ్యద్ హఫీజ్ (32), డీలక్స్ మొబైల్ షాప్, షర్బతి కాలువ, బోధన్.
పైన పేర్కొన్న నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు పంపించడం జరిగింది.
⚠️ ప్రజలకు సూచనలు.
మీ బ్యాంక్ అకౌంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకండి లేదా అమ్మకండి.
OTP, PIN, CVV వంటి వివరాలను ఎవరితోనూ పంచుకోకండి.
తెలియని కాల్స్, లింక్స్, మెసేజెస్‌పై నమ్మకం పెట్టుకోకండి.
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్లను నమ్మకండి.
ఏదైనా సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయండి.
ప్రజలకు విజ్ఞప్తి,
సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం అత్యంత కీలకం. పోలీస్ శాఖ మీ భద్రత కోసం ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఉంటుంది.

























