పాల్వంచలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలపై అవగాహన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
కామారెడ్డి జిల్లా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (డీఎస్పీ) మధుసూదన్ ఆధ్వర్యంలో పాల్వంచ గ్రామంలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాలు, సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మధుసూదన్ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే, ముఖ్యంగా ఒక గంటలోపు 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.
బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు ఎవరూ ఫోన్ ద్వారా OTP అడగరని, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ OTPలను ఇతరులకు చెప్పవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు.

పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, యు. శేషారావు, పీసీ ప్రభాకర్ ఆధ్వర్యంలో మాటలు, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, సీఐ శ్రీధర్ గౌడ్, మాచారెడ్డి ఎస్‌ఐ విజయ్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ నరేష్, ట్రాఫిక్ ఇన్‌చార్జి ఆర్‌ఎస్‌ఐ చంద్రశేఖర్, పీసీ ప్రవీణ్, మాచారెడ్డి పోలీస్ అధికారులు, సిబ్బంది, పాల్వంచ గ్రామ సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ సత్యం, గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

























