బీడీ కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు
పోస్ట్‌మెట్రిక్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్, సెప్టెంబర్ 2: బీడీ కార్మికుల పిల్లలకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అందిస్తున్న ఉపకార వేతనాలకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు బీడీ కార్మికుల సంక్షేమ శాఖ భీంగల్ డివిజన్ సీనియర్ ఫార్మసీ ఆఫీసర్ ఎం. గంగాధర్ తెలిపారు.
2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు సెప్టెంబర్ 30లోగా, 11వ తరగతి నుంచి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలకు అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో పోస్ట్‌మెట్రిక్ దరఖాస్తులకు ఆగస్టు 31 వరకు గడువు ఉండగా, తాజాగా సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు.
బీడీ కార్మికుల కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని రూ.2.52 లక్షలుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు సమయంలో విద్యార్థి వివరాలు, విద్యా ధ్రువపత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సూచించారు.
బీడీ కార్మికుల పిల్లలకు విద్యాపరంగా ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎం. గంగాధర్ కోరారు.

























