భీంగల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్: ఆఖరి శ్వాస వరకు ప్రజల సంక్షేమం కోసం పరితపించిన మహానేత, పేద ప్రజల ఆరాధ్య దైవం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్ ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. డాక్టర్ వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలను తన సమస్యలుగా భావించి వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడిగా వైఎస్సార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. వైఎస్సార్ ఆశయాలు, ప్రజా సంక్షేమ పాలనను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని మల్లెల లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆయన చూపిన ప్రజాసేవా మార్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

























