- నివారణాత్మక పోలీసింగ్‌పై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర డీజిపి బి. శివధర్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్బంగా ఆదివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్న రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముందుగా సాయిధ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. మల్టీ జోన్ ఐజిపీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతంపలికారు. పోలీస్ హెడ్ క్వాటర్స్ లో నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అదేవిదంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను మల్టీ జోన్ ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి తో కలసి డిజిపి ప్రారంభించారు.
పోలీస్ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, పోలీస్ ఫ్యామిలీ గృహ భవనాలను పరిశీలించారు. టెన్నిస్, పికిల్ బాల్, షటిల్ కోర్ట్, నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా పోలీస్ సిబ్బంది, పోలీస్ పిల్లలను ఉత్తమ క్రీడాకారులను చేయడం లక్ష్యంగా నిర్మితమైతుందని అన్నారు. అదేవిదంగా నిత్యం విధినిర్వహణలో ఉండే తెలంగాణ పోలీస్ సిబ్బంది కుటుంబాలకు మెరుగైన వసతి కల్పించడం ద్వారా పోలీస్ సిబ్బంది పనితీరును మరింత మెరుగుపరచే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన పోలీస్ గృహ భవనాలను నిర్మించామని డిజిపి తెలిపారు. అనంతరం పోలీస్ శిక్షణ కేంద్రంలో పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశంలో పాల్గొని జిల్లా వ్యాప్తంగా నేర గణాంకాలు, ముఖ్య కేసుల దర్యాప్తు పురోగతి, శాంతి భద్రతా చర్యలు, మహిళలు, శిశువుల భద్రత, సైబర్ నేరాల, రోడ్డు ప్రమాదాలు, మాదకద్రవ్యాల నియంత్రణ, ఇసుక అక్రమ రవాణా పై చేపడుతున్న చర్యలు, పలు అంశాలపై విస్తృత సమీక్ష చేపట్టారు.
ఈ సందర్బంగా డీజిపి మాట్లాడుతూ..తెలంగాణ పోలీసుశాఖకు దేశంలోనే మంచి పేరుందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే నేరాల నియంత్రణలోనూ.. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలోనూ ముందువరుసలో ఉన్నామని తెలిపారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల మరణాలు, మాదకద్రవ్యాలు…ఇప్పుడు తెలంగాణ సమాజం ముందున్న పెనుసవాళ్లని వీటి నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ), ఈగల్ దేశంలోనే అత్యున్నతంగా పనిచేస్తున్నాయని అన్నారు. డ్రగ్స్ ముఠాలు తెలంగాణ నుండి వెళ్లిపోయేలా చేయడంలో కీలకంగా వ్యవహరించిందన్నారు. “పదేళ్లుగా సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయని, ఇది సాధారణ సమస్య కాదని పేర్కొన్నారు. స్వీయ అవగాహనతోనే సైబర్ మోసాలకు కళ్లెం వేసేందుకు ఇంటి గుమ్మం వద్దకు ప్రచారాన్ని తీసుకెళ్లాలనే లక్ష్యంతో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ రూపొందించిన ‘సైబర్ సింబా’ కార్యక్రమం జిల్లాలో అమలు చేయడం ద్వారా సైబర్ నేరాల నివారణ చర్యలు చేపట్టాలన్నారు.రోడ్డు ప్రమాదాలు తీవ్ర సమస్యగా మారుతోందని, రోడ్డు ప్రమాదాల విషయంలో దారుణమైన రికార్డులు నమోదు అవుతున్నాయని, ప్రతి సంవత్సరం వేలాది మంది యువత మరణిస్తున్నారని, ఇది తీవ్ర ఆందోళనకరమైన సమస్య అని అన్నారు. ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తులు సురక్షితంగా ఇంటికి చేరాలని లక్ష్యంతో చేపట్టిన అరైవ్ అలైన్ కార్యక్రమాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలపై సీరియస్ దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని కూడ అన్ని శాఖల సమన్వయంతో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సంకల్పంతో మార్చి 25 నుండి 31 వరకు అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తునట్లు తెలిపారు. మాదకద్రవ్యాల రవాణాను ఏమాత్రం సహించబోమని, గంజాయి వంటి మాదకద్రవ్యాలపై తనిఖీలు, నిఘా పెరగటంతో ముఠాలు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, కట్టడి చేసేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.
బేసిక్ పోలీసింగ్, చట్టాలపై లోతైన అవగాహన కోసం దృష్టి పెట్టాలని, పోలీస్ స్టేషన్ రికార్డు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలని, దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని, ప్రజలకు వేగంగా న్యాయం అందించేలా పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ జిల్లా నేర ధోరణులు, పెండింగ్ కేసుల స్థితి, ముఖ్య విచారణల పురోగతి, నేర నియంత్రణకు అమలు చేస్తున్న ప్రత్యేక చర్యల వివరాలు డీజీపీకి వివరించారు.కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రసాద్ రావు, రామానుజం, కుమారస్వామి, విజయబాబు ఏసీపీ రమణమూర్తి, తిరుపతి రెడ్డి,సారంగపాణి, శ్రీనివాసులు, మహేష్, సర్వర్, సత్యనారాయణ, ఫణిందర్, సుశీల్ సింగ్, నర్సయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.























