మోర్తాడ్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం: 13 మందికి తీవ్ర గాయాలు.. బాలుడి పరిస్థితి విషమం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్. కే నగేష్ …
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని మోర్తాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ తీవ్ర భయాందోళన సృష్టించింది. వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారిపై ఒక్కసారిగా దాడి చేయడంతో మొత్తం 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ దాడిలో ఓ 8 సంవత్సరాల బాలుడికి తీవ్ర రక్తగాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మిగతా 12 మంది క్షతగాత్రులను వెంటనే స్థానిక మోర్తాడ్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి (CHC) తరలించగా, వైద్యులు వారికి ప్రాథమిక చికిత్స అందించి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్లు వేశారు.
గ్రామంలో కుక్కల బెడద తీవ్ర రూపం దాల్చడంతో రోడ్లపైకి రావాలంటేనే స్థానికులు వణికిపోతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొంది. ప్రాణాలు పోయే వరకు చూస్తూ ఊరుకుంటారా అని స్థానికులు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పిచ్చికుక్కల బెడద నుంచి గ్రామాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

























