భీంగల్ మండలంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని బెజ్జోరా, కొత్త తండా, తాళ్లపల్లి గ్రామాల్లో నిరుపేద లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
మొదటి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసిన నేపథ్యంలో, అదనంగా మంజూరైన ఇళ్లకు సంబంధించిన మంజూరు పత్రాలను కూడా ఈరోజు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

























