గణేష్ మండపాలకు పటిష్ట భద్రత
జియో ట్యాగింగ్, సీసీ కెమెరాలతో నిఘా.. నిమజ్జనానికి ప్రత్యేక బందోబస్తు: సీపీ సాయి చైతన్య…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గణేష్ మండపాల వద్ద పోలీస్ నిఘాను పటిష్టం చేసినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 5,681 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో నిజామాబాద్ డివిజన్లో 2,545, ఆర్మూర్ డివిజన్లో 1,959, బోధన్ డివిజన్లో 1,177 విగ్రహాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రతి గణేష్ మండపాన్ని జియో ట్యాగింగ్‌కు అనుసంధానం చేసినట్లు సీపీ తెలిపారు. బ్లూకోర్ట్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో మండపాలను సందర్శించి వివరాలను సేకరించి పోలీస్ వెబ్ అప్లికేషన్ ద్వారా జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ప్రతి మండపానికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులకు అందుబాటులో ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు సంఘటనా స్థలానికి త్వరగా చేరుకునేందుకు వీలవుతుందని తెలిపారు.
మండపాల వద్ద భద్రత కోసం బ్లూకోర్ట్స్, పెట్రోకార్ సిబ్బంది మూడు షిఫ్టుల్లో నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని చెప్పారు. మండపాలను క్రమం తప్పకుండా సందర్శిస్తూ నిర్వాహకులకు భద్రతా సూచనలు ఇస్తున్నట్లు తెలిపారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా నిజామాబాద్‌లోని ప్రధాన నిమజ్జన మార్గంలో సుమారు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ వెల్లడించారు. వీటిని పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి 24 గంటల పాటు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సీపీ సాయి చైతన్య కోరారు.

























