బీ.సీ స్టడీ సర్కిల్ ను సందర్శించిన కలెక్టర్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్, జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో కొనసాగుతున్న బీ.సీ స్టడీ సర్కిల్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం సాయంత్రం సందర్శించారు. ఇది అద్దె భవనంలో కొనసాగుతుండడంతో తగిన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా అని కలెక్టర్ నిశిత పరిశీలన జరిపారు. స్టడీ సర్కిల్ లో ఎంతమంది శిక్షణ పొందుతున్నారు, వారికి ఎలాంటి శిక్షణ అందిస్తున్నారు,ఎంతమందికి ఇప్పటివరకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి,దీని నిర్వహణకు ప్రతీ నెల ఎంత మొత్తం వ్యయం అవుతోంది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీ.సీ స్టడీ సర్కిల్ కు శాశ్వత ప్రాతిపదికన రూ. 3.65 కోట్లను వెచ్చిస్తూ పక్కా భవనం నిర్మాణం కోసం గంగాస్తాన్ లో 2016 లోనే శంకుస్థాపన చేసినప్పటికీ న్యాయపరమైన సమస్య కారణంగా పనులు చేపట్టలేకపోతున్నారని పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు.దీంతో కలెక్టర్ ఇలా త్రిపాఠి గంగాస్తాన్ లో బీ.సీ స్టడీ సర్కిల్ భవన నిర్మాణం కోసం ఉద్దేశించిన స్థలాన్ని సైతం సందర్శించి పరిశీలించారు.న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్డీఓ రాజేంద్రకుమార్,ట్రైనీ సబ్ కలెక్టర్ సందీప్, ఇంచార్జి డీ.ఈ.ఓ సాయాగౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయికుమార్, బీ.సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న తదితరులు ఉన్నారు.























