దేశవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఒక యూనిట్ రక్తం అవసరం
రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి జిల్లా : కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రక్తహీనతతో బాధపడుతున్న పవిత్ర (28)కు ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో శ్రీరామ్ సాత్మారాం మానవతా దృక్పథంతో స్పందించి, సకాలంలో రక్తదానం చేశారు. ఈ విషయాన్ని ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా నిరంతరం రక్తానికి డిమాండ్ ఉంటుందని, అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి, వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకునే వారికి, రక్తహీనతతో బాధపడుతున్న వారికి, తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని తెలిపారు. సకాలంలో రక్తం అందకపోతే ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, కేవలం మానవతా దృక్పథం కలిగిన వ్యక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారానే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన శ్రీరామ్ సాత్మారాంను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీహెచ్ ప్రసాద్‌తో పాటు బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

























