లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలు.. దర్శన వేళల్లో మార్పులు!
నవంబర్ 19, 24, 25, 26 తేదీల్లో ప్రత్యేక దర్శనాలు రద్దు.. నవంబర్ 17న ధ్వజారోహణం సందర్భంగా దాతలు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లింబాద్రి గుట్టపై నవంబర్ 15 నుంచి 26వ తేదీ వరకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ దర్శన ఏర్పాట్లలో మార్పులు చేపట్టినట్లు ఆలయ ప్రధాన అర్చకులు నంబి పార్థసారథి తెలిపారు.
ధ్వజారోహణం రోజున దాతలు, వీఐపీలకు ప్రత్యేక దర్శనం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవంబర్ 17న నిర్వహించే ధ్వజారోహణం సందర్భంగా స్వామివారి దాతలు, వీఐపీలకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి సంపూర్ణ అలంకార దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
నాలుగు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు
నవంబర్ 19, 24, 25, 26 తేదీల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సామాన్య భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
భక్తుల రద్దీని నియంత్రించడం, తొక్కిసలాట వంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో ఆలయ యంత్రాంగానికి భక్తులు సహకరించాలని నంబి పార్థసారథి కోరారు. బ్రహ్మోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, వైభవంగా నిర్వహించేందుకు భక్తులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

























