ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
పరీక్షల నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ జిల్లా: ఈ నెల 29న (ఆదివారం) నిర్వహించనున్న ఎస్‌ఐ పోస్టుల నియామక ప్రిలిమినరీ రాత పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య, ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల రీజినల్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డినేటర్, ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిబ్బంది మరియు అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై వివరించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 6,810 మంది అభ్యర్థులు ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. ఇందుకోసం మొత్తం 20 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఫర్నిచర్, గాలి, వెలుతురు, తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల గుర్తింపు కోసం బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సేకరిస్తారని తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా, అంటే ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఉదయం 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు.
అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే సందర్శించి చూసుకోవాలని సూచించారు. దీనివల్ల పరీక్ష రోజున కేంద్రానికి చేరుకోవడం సులభమవుతుందని తెలిపారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు హాల్‌టికెట్‌లో పొందుపరిచినందున అభ్యర్థులు వాటిని ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చదువుకోవాలని సూచించారు.
ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు
పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, వాచీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర నిషేధిత వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు చేతులకు గోరింటాకు, మెహందీ పెట్టుకోవద్దని సూచించారు. వాటివల్ల బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు సరిగ్గా నమోదుకాకపోవచ్చని, తద్వారా అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (గతంలో సెక్షన్ 144 సీఆర్‌పీసీ) అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షకు సంబంధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు.
ఉద్యోగాల పేరుతో మోసగాళ్లను నమ్మవద్దు
ఎస్‌ఐ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని అభ్యర్థులు గుర్తించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని, అలాంటి వారి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
అభ్యర్థుల సౌకర్యార్థం బస్టాండ్ వద్ద పరీక్షా కేంద్రాలకు వెళ్లే మార్గాలను సూచిస్తూ రూట్ మ్యాప్‌లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ పరీక్షల నిర్వహణకు రీజినల్ కోఆర్డినేటర్‌గా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ పి. రామ్‌మోహన్ రెడ్డి, పోలీస్ నోడల్ ఆఫీసర్‌గా అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ వ్యవహరిస్తారని తెలిపారు. పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే వారి దృష్టికి తీసుకెళ్లి నివృత్తి చేసుకోవాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్‌తో పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ, సీసీఎస్, సీసీఆర్‌బీ విభాగాల ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, రాజశేఖర్, నరేందర్, శ్రీశైలం, గురు నాయుడు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు, ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























