హుమ్నాపూర్‌లో భూ రీ సర్వే పనులను పరిశీలించిన తహసీల్దార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ఏ గణేష్
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు భూ రీ సర్వే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మొదటి విడతలో తిరుమలాపూర్ గ్రామంలో సర్వే పనులు ప్రారంభించగా, రెండో విడతలో భాగంగా శనివారం పోతంగల్ మండలంలోని హుమ్నాపూర్ గ్రామంలో భూ రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పోతంగల్ మండల తహసీల్దార్ సందీప్ కుమార్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పనులు నిర్వహించాలని సర్వే బృందానికి సూచించారు. నిర్ణీత గడువులోగా రీ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ సందీప్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలోని రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సర్వే అధికారుల బృందానికి అందించి, భూ రీ సర్వే పనులకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సర్వే బృందం సభ్యులు పోశెట్టి (సర్వేయర్), విజయ్ (గిర్దావర్), పోశెట్టి, శ్రీకాంత్, నరేష్, జె. శ్రీకాంత్ (జీపీఓలు), పట్టాదారులు, రైతులు పాల్గొన్నారు.

























