లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లు, నగదు అపహరణ.. ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట్
కర్ణాటకకు చెందిన ఐదుగురు నిందితుల పట్టివేత – క్రెటా కారు, 25 లాడ్జీ రిజిస్టర్లు, నకిలీ బంగారు బిస్కెట్లు స్వాధీనం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కనకంటి హరీష్
కామారెడ్డి జిల్లా : లాడ్జీల మేనేజర్లను బెదిరించి, అక్కడ బస చేసిన వ్యక్తుల వ్యక్తిగత వివరాలు ఉన్న రిజిస్టర్లు, నగదును అపహరిస్తూ.. ఆ వివరాల ఆధారంగా బంగారం పేరుతో అమాయకులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి క్రెటా కారు, 25 లాడ్జీ రిజిస్టర్లు, నకిలీ బంగారు బిస్కెట్లు, ఐదు సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కవాచ్‌లో భాగంగా చేపట్టిన తనిఖీల్లో ఈ ముఠా పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర వెల్లడించారు.
అక్షయ గ్రాండ్ లాడ్జీలో చోరీ
ఈ నెల 21, 22 తేదీల మధ్య అర్ధరాత్రి కామారెడ్డి పట్టణంలోని అక్షయ గ్రాండ్ లాడ్జికి ఐదుగురు వ్యక్తులు వెళ్లి గది కావాలని అడిగారు. అనంతరం విధుల్లో ఉన్న మేనేజర్‌ను బెదిరించి రూ.10 వేల నగదు, లాడ్జీ రిజిస్టర్లను అపహరించారు. మేనేజర్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా స్క్రూడ్రైవర్ చూపించి, కారుకింద పడేసి చంపుతామని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో, టౌన్ ఎస్హెచ్ఓ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుల కోసం గాలింపు చేపట్టాయి.
ఆపరేషన్ కవాచ్‌లో పట్టుబడిన నిందితులు
నవంబర్ 24 రాత్రి కామారెడ్డి పట్టణ ప్రవేశ మార్గంలోని ఆపరేషన్ కవాచ్ చెక్‌పోస్ట్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన క్రెటా కారును పోలీసులు తనిఖీ చేశారు. కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని విచారించగా, అక్షయ గ్రాండ్ లాడ్జీలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు.
నిందితులను కర్ణాటక రాష్ట్రంలోని విజయనగర జిల్లా హోస్పేట్ ప్రాంతానికి చెందిన మాచిహళ్లి మారుతి, చక్రి పరశురామ్, అభిషేక్ కవ్వాడి, వెంకటేష్ సట్పాడి, సంతోష్ సట్పాడిగా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.
రిజిస్టర్లలోని వివరాలతో బంగారం పేరుతో మోసాలు
ఈ ముఠా ముందుగా వివిధ ప్రాంతాల్లోని లాడ్జీలు, హోటళ్లకు వెళ్లి గదులు కావాలని అడిగి, మేనేజర్లను బెదిరించి అక్కడ బస చేసిన వ్యక్తుల పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు ఉన్న రిజిస్టర్లను అపహరించేది.
అనంతరం రిజిస్టర్లలోని ఫోన్ నంబర్లకు కాల్ చేసి, బాధితులు గతంలో ఏ లాడ్జీలో ఎప్పుడు బస చేశారు, వారి ఆధార్ వివరాలు వంటి సమాచారాన్ని చెబుతూ పరిచయస్తులమనే నమ్మకం కలిగించేవారు. ఆ తర్వాత కర్ణాటకలో తక్కువ ధరకు బంగారం లభిస్తుందని, భూమిలో బంగారం దొరికిందని, ప్రభుత్వానికి అప్పగిస్తే తమకు ఏమీ మిగలదని చెప్పి తక్కువ ధరకు ఇస్తామని నమ్మించేవారు.
మొదట అసలైన బంగారాన్ని నమూనాగా చూపించి, అనంతరం కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేయవచ్చని నమ్మించి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ వివరించారు.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నేరాలు
దర్యాప్తులో భాగంగా తెలంగాణలోని జోగుళాంబ గద్వాల, జడ్చర్ల, షాద్‌నగర్, కొత్తూరు, హైదరాబాద్‌లోని చందానగర్, సంగారెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్ తదితర ప్రాంతాల్లోని పలు లాడ్జీల మేనేజర్లను బెదిరించి రిజిస్టర్లు అపహరించినట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు.
ఈ ముఠా నాగరాజు అనే వ్యక్తి వద్ద నుంచి టూర్‌కు వెళ్తున్నామని చెప్పి క్రెటా కారును అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
పోలీసుల స్వాధీనంలో కీలక ఆధారాలు
నిందితుల నుంచి రూ.8,500 నగదు, నేరానికి ఉపయోగించిన క్రెటా కారు (KA 05 ND 8238), ఒక స్క్రూడ్రైవర్, 25 లాడ్జీ రిజిస్టర్లు, 10 తులాలు, 2 తులాలు, ఒక తులం, అర తులం బరువున్న నకిలీ బంగారు బిస్కెట్లు, ఐదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న రిజిస్టర్లలోని వ్యక్తిగత వివరాలను ఉపయోగించి మరిన్ని మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, నిందితుల ఇతర నేరాలు, నేర చరిత్ర, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
ఆపరేషన్ కవాచ్‌లో అప్రమత్తంగా వ్యవహరించి ఐదుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పట్టుకున్న దర్యాప్తు అధికారి, ఏఆర్ఎస్ఐ సాయిలు, సిబ్బంది భాను, రాహుల్, శుండాల సింగ్, పీర్య, ఇతర పోలీసు సిబ్బంది, మల్లేష్ హోంగార్డును ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వారికి నగదు రివార్డులు అందజేశారు.
తక్కువ ధరకు బంగారం ఇస్తామంటే నమ్మవద్దు: ఎస్పీ
మార్కెట్ ధర కంటే తక్కువకు బంగారం లేదా విలువైన వస్తువులు ఇస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ ప్రజలకు సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్లో మీ వ్యక్తిగత, ఆధార్ లేదా గత ప్రయాణ వివరాలు చెబుతూ నమ్మకం కలిగించినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, మోసపూరిత కార్యకలాపాలు జరిగినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

























