పిప్రిలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
వర్షాకాలంలో పిప్రి గ్రామంలోని రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్ అరిగెల జనార్ధన్ స్పందించారు. గుంతలను పరిశీలించి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణమే మరమ్మతు చర్యలు చేపట్టారు.
గుంతలను పూడ్చేందుకు చిప్స్, వైట్ మిక్స్ తదితర సామగ్రిని తెప్పించి రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ జనార్ధన్ మాట్లాడుతూ.. గ్రామాలు పట్టణాలకు పునాదులుగా ఉండేలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని, పిప్రి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ప్రభుత్వం ద్వారా అందుతున్న వివిధ పథకాలను గ్రామానికి తీసుకురావడంతో పాటు, అవసరమైన చోట రహదారుల మరమ్మతులకు కూడా ప్రభుత్వం సహకరించాలని కోరారు. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రంజిత్, జేమ్స్, జితేందర్, పంచాయతీ కార్యదర్శి, కారోబార్ ముత్యాల, వీడీసీ అధ్యక్షుడు శ్రీనివాస్, రౌతు గంగాస్వామి, గంగారాం, లక్ష్మన్న, పార్టీ అధ్యక్షుడు తదితరులతో పాటు జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

























