రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి…
ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన BC, SC, ST-JAC & DSP నాయకులు
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
ధర్పల్లి: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్లో ఉన్న సుమారు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని BC, SC, ST-JAC, DSP నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మండల నాయకులు ప్రశాంత్, వడ్ల బాలయ్య, మహిపాల్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఫీజులు చెల్లించలేక ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కళాశాలల్లో చదువులు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సకాలంలో విడుదల కాకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడుతోందని, కొందరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువులను మధ్యలోనే మానుకునే పరిస్థితి నెలకొందని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో BC, SC, ST-JAC మండల నాయకులు భాస్కర్ ముదిరాజ్, కిషన్, సాయిలు, అక్షయ్, గోపీ, గంగాధర్, నర్సయ్య, రాజేశ్వర్తో పాటు DSP-JAC నాయకులు పాల్గొన్నారు.

























