గణపతి శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి
అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు
రూట్ మ్యాప్ పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ…
ఇందూరు: నగరంలో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అధికారులను సూచించారు.
బుధవారం నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి లలితా మహల్, గాంధీగంజ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, పవన్ టాకీస్, గాజుల్‌పేట్, పెద్దబజార్, గోల్ హనుమాన్ మీదుగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర నిర్వహించే రూట్ మ్యాప్‌ను ఎమ్మెల్యే పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందూరులో నిర్వహించే గణపతి శోభాయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. సుమారు వందేళ్లుగా అనంత చతుర్దశి రోజున ప్రత్యేక రథంపై వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోందని తెలిపారు. ఈ నెల 25న జరిగే శోభాయాత్రకు సంబంధించి నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించినట్లు చెప్పారు.
విద్యుత్, మున్సిపల్ కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్, పోలీస్ శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రధానంగా విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతల పూడ్చివేత, అవసరమైన ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణం, వినాయకుల బావి వద్ద భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
గణపతి మండపాల నిర్వాహకులు, భక్తులు శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్రను నిర్వహించాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, జ్యోతి మురళి, నాయకులు పంచరెడ్డి శ్యామ్, శ్రీనివాస్, మరావర్ కృష్ణ, మహిళా మోర్చా అధ్యక్షురాలు వనిత తదితరులు పాల్గొన్నారు.

























