పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 4 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: దేశ ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల సేవలు, త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేశ్ చంద్ర, ఐపీఎస్ అన్నారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డి పట్టణంలో 4 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జీఆర్ కాలనీ వద్ద జిల్లా ఎస్పీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆయన స్వయంగా సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొని, ముగింపు వరకు కొనసాగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుల విధులు, సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్న వారిని అభినందించారు.
జీఆర్ కాలనీ నుంచి ప్రారంభమైన ర్యాలీ హౌసింగ్ బోర్డు కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా సాగి, కలాభారతి వద్ద ముగిసింది.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఇతర పోలీసు అధికారులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

























