దీపావళి టపాకాయల దుకాణాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి
అనుమతి లేకుండా దుకాణాలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు: నిజామాబాద్ పోలీస్ కమిషనర్ హెచ్చరిక…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్: దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాత్కాలిక టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వ్యాపారులు తప్పనిసరిగా సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయం నుంచి అనుమతి పొందాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయదలచిన వ్యాపారులు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును సంబంధిత ఏసీపీ కార్యాలయంలో సమర్పించి, అనుమతి పొందాలని సూచించారు. అనుమతులకు సంబంధించిన ఇతర వివరాల కోసం సంబంధిత డివిజనల్ స్థాయి పోలీస్ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
అనుమతి లేకుండా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసిన వారిపై పేలుడు పదార్థాల చట్టం, 1884 (Explosives Act, 1884), సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టపాకాయల దుకాణదారులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు:
1. టపాకాయల దుకాణాలను అనుమతించిన ఖాళీ ప్రదేశాల్లోనే ఏర్పాటు చేయాలి.
2. దుకాణాలు ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి అవసరమైన నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) సమర్పించాలి.
3. ఒక క్లస్టర్‌లో 50 దుకాణాలకు మించి ఏర్పాటు చేయరాదు.
4. జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయకూడదు.
5. కళ్యాణ మండపాలు, సమావేశ కేంద్రాల్లో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయరాదు.
6. తాత్కాలిక దుకాణాల్లో అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తప్పనిసరిగా చేపట్టాలి.
దీపావళి పండుగను ప్రజలందరూ సురక్షితంగా జరుపుకునేలా వ్యాపారులు పోలీసుల సూచనలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

























