ఏటీఎంలో నకిలీ నోటు కలకలం!
రూ.24 వేల నగదు డ్రా చేయగా.. రూ.500 నకిలీ నోటు వచ్చినట్లు బాధితురాలి ఆరోపణ
ఏటీఎం నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ధరణి డిమాండ్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలోని ఏటీఎంలో నకిలీ నోటు వచ్చినట్లు ఓ మహిళ ఆరోపించడం కలకలం రేపింది.
భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన ధరణి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో పట్టణంలోని ముచ్కూర్ చౌరస్తా వద్ద ఉన్న ఇండియన్ 1 ఏటీఎం నుంచి రూ.24 వేల నగదును డ్రా చేశారు. అయితే ఆ నగదులో రూ.500 నకిలీ నోటు వచ్చినట్లు ఆమె వాపోయారు.
ఏటీఎం నుంచి డ్రా చేసిన నగదులోనే నకిలీ నోటు రావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత ఏటీఎం నిర్వాహకులు స్పందించి విచారణ చేపట్టాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ధరణి కోరారు.

























