ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం!
భీంగల్ పాఠశాలలో బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన
ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచనలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీంగల్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్‌కు చెందిన జిల్లా విద్యా విషయ తనిఖీ బృందం భీంగల్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనా విధానాలు, మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి పలు సూచనలు చేసింది.
అనంతరం పాఠశాలలో సమీక్ష సమావేశం నిర్వహించి, ఉపాధ్యాయులు తమ బోధనా సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకునేందుకు అవసరమైన పలు మెళకువలను వివరించారు.
ఈ సందర్భంగా పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని తనిఖీ బృందాన్ని కోరారు.
ప్యానెల్ బృంద సభ్యుడు రాచర్ల గంగాధర్ మాట్లాడుతూ.. తాను విద్యనభ్యసించిన పాఠశాలకు తనిఖీ అధికారిగా రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తనకు బాల్యంలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు గుణేశ్వర్ను ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్యానెల్ బృంద డిప్యూటీ నోడల్ అధికారి చిన్నయ్య, బృంద సభ్యులు విశ్వనాథ్, గంగా మోహన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

























