ధర్పల్లి డిగ్రీ కళాశాల విద్యార్థులకు పారిశ్రామిక క్షేత్ర పర్యటన…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాదు జిల్లా ధర్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ధర్పల్లిలో ఎన్‌ఎస్‌ఎస్, ఈడీసీ సెల్ ఆధ్వర్యంలో పారిశ్రామిక క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రభుత్వ వరి కొనుగోలు కేంద్రాన్ని, స్థానిక రైస్ మిల్లును సందర్శించారు.
ఈ సందర్భంగా వరి ధాన్యం బియ్యంగా మారే ప్రక్రియను విద్యార్థులు ప్రత్యక్షంగా పరిశీలించారు. ధాన్యం శుభ్రపరచడం, ఆరబెట్టడం, పొట్టు తీయడం, నాణ్యత పరిశీలన, బియ్యం వేరు చేయడం, ప్యాకింగ్ వంటి వివిధ దశలను రైస్ మిల్ నిర్వాహకులు వివరించారు.
ఈ పర్యటన ద్వారా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపార నిర్వహణ, ఆధునిక యంత్రాల వినియోగంపై విద్యార్థులకు ఆచరణాత్మక అవగాహన కలిగిందని ఈడీసీ, ఎన్‌ఎస్‌ఎస్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. కుమారస్వామి తెలిపారు. ఇలాంటి పర్యటనలు విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచనా విధానాన్ని, వ్యాపార నైపుణ్యాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
విద్యార్థులకు పరిశ్రమలపై ప్రత్యక్ష అవగాహన కల్పించిన ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. జ్యోతి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ సభ్యుడు డాక్టర్ సీహెచ్. రామచందర్ పాల్గొన్నారు.

























