తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీలో కామారెడ్డికి చోటు
సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి నియామకం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి: తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ విద్యావేత్త, ఆర్కే గ్రూప్ సీఈఓ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి నియమితులయ్యారు. క్రీడారంగానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. మల్లారెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, చైర్మన్‌గా మాజీ మంత్రి వేన్ గోపాలాచారి, వైస్ చైర్మన్‌గా శాసనమండలి మాజీ చైర్మన్ బండా ప్రకాశ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయి అడ్వైజరీ కమిటీలో కామారెడ్డి జిల్లాకు చెందిన జైపాల్ రెడ్డికి చోటు దక్కడం పట్ల జిల్లా క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా కృషి చేస్తానన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తానని తెలిపారు. ఆయన నియామకం పట్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, క్రీడాకారులు, అభిమానులు అభినందనలు తెలిపారు.

























