తెలంగాణ వైతాళికుడు డాక్టర్ దాశరధి కృష్ణమాచార్య
బ్యారక్ నెంబర్ 18నీ సందర్శించిన జడ్పిహెచ్ఎస్ సారంగపూర్ విద్యార్థులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా గళమెత్తి కఠిన శిక్ష అనుభవించిన చారిత్రక నిజామాబాద్ జైలును సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు నవంబర్ 3, మంగళవారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి తెలుగు ఉపాధ్యాయుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ కవి అంటే కేవలం కలంబట్టి ప్రజలు చేయడమే కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి ఉద్యమం కూడా చేయగలడని నిరూపించిన వ్యక్తి డాక్టర్ దాశరథి అని తెలిపారు. మరో ఉపాధ్యాయులు డాక్టర్ సుంకర గంగాధర్ డాక్టర్ దాశరథి జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు.ఈ విద్యా యాత్రలో భాగంగా జైలు గదుల్లో దాశరథి పడిన యాతనలను, నిర్బంధంలోనూ ఆయన కలం నుండి జాలువారిన విప్లవ కవితా ధారలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా “నా తెలంగాణ కోటి రత్నాల వీణ” మరియు “ఓరీ నిజాము పిశాచమా నిలుబోలిన రాజు లేడెన్నడేని…” వంటి దాశరథి అమర కవితా పాదాలను స్మరించుకుంటూ విద్యార్థులు ఆ చారిత్రక ప్రదేశం లో స్ఫూర్తిని పొందా రు. ఈ సందర్భంగా దాశరథి రాసిన పద్యాలను కవితలను విద్యార్థులు ఉపాధ్యాయులు పఠించారు. ఈ యాత్ర ద్వారా తెలంగాణ అస్తిత్వం, స్వాతంత్ర్య పోరాటంలో కవులు అందించిన త్యాగాల విలువ నేటి తరానికి ప్రత్యక్షంగా అవగాహన కల్పించేందుకు ఈ విద్యాయాత్ర దోహదపడుతుందని, దాశరథి కృష్ణమాచార్య జీవిత చరిత్రను, త్యాగాన్ని విద్యార్థుల ప్రత్యక్ష అనుభూతిలోకి తీసుకొచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఘనపురం దేవేందర్, డాక్టర్ సుంకరి గంగాధర్, కడారి లలిత, నిర్మల పాఠశాల పదవ తరగతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.























