ఇందల్వాయిలో కార్తీక పౌర్ణమి వేడుకలకు ఏర్పాట్లు.. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత పనులు
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక పౌర్ణమి వేడుకలను విజయవంతం చేయాలి: విడిసి చైర్మన్ రియాజ్…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహించే కార్తీక పౌర్ణమి వేడుకలను పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ (విడిసి) చైర్మన్ రియాజ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆలయ పరిసరాలను శుభ్రపరిచి, పరిశుభ్రత పనులు చేపట్టారు.
కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదని, ఈ మాసంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగిస్తూ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్ది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామంలోని ఆడపడుచులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించి శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. గ్రామం సుఖసంతోషాలతో, పాడిపంటలతో కళకళలాడాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించాలని తెలిపారు.
కార్తీక పౌర్ణమి వేడుకలను విజయవంతం చేసేందుకు గ్రామ ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ సహకరించి అధిక సంఖ్యలో పాల్గొనాలని విడిసి చైర్మన్ రియాజ్ విజ్ఞప్తి చేశారు.

























