గంగాధర్ కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యువజన సంఘం
కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.. ఇది మా సామాజిక బాధ్యత: మండల అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా : కమ్మర్‌పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన చెరుకు గంగాధర్ జీవనోపాధి కోసం దుబాయ్‌కి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపిందని కమ్మర్‌పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్ అన్నారు.
కుటుంబ పోషణ కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన గంగాధర్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో భార్య, చిన్న కుమార్తెతో కూడిన నిరుపేద కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక, మానవతా బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కమ్మర్‌పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం సభ్యులంతా తమ వంతు సహకారంగా కొంత మొత్తాన్ని జమ చేసి సోమవారం గంగాధర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా సుంకరి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. గంగాధర్ కుటుంబం ఒంటరిది కాదని, సమాజం వారికి అండగా ఉంటుందనే భరోసా కల్పించడమే తమ ప్రయత్నమని తెలిపారు. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న ఎంతోమంది కార్మికులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతుండటం వారి కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగులుస్తోందన్నారు. ఇలాంటి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం కార్యవర్గ సభ్యులు గుర్రం నరేష్, మేకల క్రాంతి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

























