అరైవ్… అలైవ్ ఒక ఉద్యమంగా సాగించాలి డీజీపీ బి. శివధర్ రెడ్డి,ఐపీఎస్
అరైవ్… అలైవ్” అవగాహన కార్యక్రమం — రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు,డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై అవగాహన
బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా “అరైవ్… అలైవ్” పేరుతో అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ), ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్, మంచిర్యాల జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ,రోడ్డు భద్రత అనేది కేవలం పోలీస్ శాఖ బాధ్యత మాత్రమే కాకుండా ప్రభుత్వ సమగ్ర విధానంలో భాగమని తెలిపారు.“99 రోజుల యాక్సిడెంట్స్ ఫ్రీ డ్రైవ్” లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రెవెన్యూ, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్ తదితర శాఖల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో రహదారి భద్రత కమిటీలు ఏర్పాటు చేసి,ఎక్కడా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉద్యమ స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. “మన గ్రామంలో, కాలనీలో ఒక్క ప్రాణం కూడా ప్రమాదంలో కోల్పోకూడదు” అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “అరైవ్… అలైవ్” కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా కొనసాగించాలని అన్నారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఒక సామాజిక సమస్యగా మారాయని, వాటిపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రతి నెల చివరి వారంలో నిర్వహించే “అరైవ్… అలైవ్” కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం మాత్రమే కాకుండా సరిగా బిగించుకోవాలని, నాలుగు చక్రాల వాహనదారులు డ్రైవర్‌తో పాటు అందరూ సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.
అదేవిధంగా, మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, అధిక వేగం, అధిక లోడింగ్ వంటి ప్రమాదకర అలవాట్లను పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు ఎల్లప్పుడూ తమ వద్ద కలిగి ఉండాలని తెలిపారు.
ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకు సూచిస్తూ, ఎక్కువ మంది ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరుగుతుందని, ప్రమాదం జరిగితే కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం ఉంటుందని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించి, అవసరమైన డ్రైవర్లకు డీజీపీ చేతుల మీదుగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐలు, ఎస్‌ఐలు, ఆర్ఐలు మరియు సుమారు 200 మంది పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.

























