ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఘన ముగింపు
నిజామాబాద్ జిల్లా, నందిపేట్ మండలం, ఐలాపూర్ గ్రామంలో గత 20 రోజులుగా ఉత్సాహంగా కొనసాగిన ఐలాపూర్ ఐకాన్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజుతో ఘనంగా ముగిసింది. ఈ టోర్నమెంట్‌లో నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
మొత్తం 60 జట్లు పాల్గొన్న ఈ పోటీల్లో ఫైనల్ మ్యాచ్‌లో ఐలాపూర్-11 జట్టు మరియు మల్లారం (నిజామాబాద్) జట్టు తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో మల్లారం జట్టు విజేతగా నిలవగా, ఐలాపూర్-11 జట్టు రన్నరప్‌గా నిలిచింది.
విజేతలు, రన్నరప్ జట్లకు ఐలాపూర్ గ్రామ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ బహుమతులు ప్రదానం చేశారు. విజేత జట్టుకు రూ.25,555 నగదు బహుమతిని సిద్ధాపురం అరుణ్ అందజేయగా, రన్నరప్ జట్టుకు రూ.15,555 నగదు బహుమతిని సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ అందించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ఇటువంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడల ద్వారా యువత గంజాయి, డ్రగ్స్ వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండగలరని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాదె శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రమణ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మేకల సురేష్, మూడేండ్ల భజన, సునీల్, గంగా ప్రసాద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన సిద్ధాపురం సునీల్, బలగం గంగా ప్రసాద్ మరియు మేనేజ్‌మెంట్ నిర్వాహకులను గ్రామ ప్రజలు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

























