బాచన్ పల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
జిల్లా విద్యా విభాగం ఆర్మూర్ డివిజన్ రెండవ బృందం మంగళవారం బాచన్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యా ప్రమాణాలను పరిశీలించింది. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి, వారి విద్యా ప్రగతిని సమీక్షించారు.
విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఉపాధ్యాయులు పాటించాల్సిన బోధనా పద్ధతులు, విషయ బోధనలో మెలకువలపై తనిఖీ బృందం సభ్యులు పలు సూచనలు చేశారు. పాఠశాల పర్యవేక్షణ అనంతరం సమీక్ష సమావేశం నిర్వహించి విద్యార్థుల అభ్యాస ఫలితాలు, బోధనా విధానాలపై చర్చించారు.
అనంతరం హిందీ భాషా ఆటల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా బాచన్ పల్లి పాఠశాలను పునరుజ్జీవింపజేసి, ఆదర్శంగా నడిపిస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీ బాల గంగాధర్ను జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్యతో పాటు బృంద సభ్యులు ఆత్మీయంగా సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా తనిఖీ బృందం నోడల్ అధికారి వెంకటయ్య, సభ్యులు కోకిల నాగరాజు, విశ్వనాథ్, గంగా మోహన్, రమేష్, రాచర్ల గంగాధర్, పీడీ గంగాధర్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

























